ఆదిలాబాద్, వెలుగు: ప్రస్తుత సమాజంలో మీడియా రంగానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జర్నలిస్టుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, విశ్లేషణ, రచన, ప్రసారం వంటి ప్రతి దశలో జర్నలిస్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం క్షణాల్లో విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. వార్తను వేగంగా అందించడం కంటే వాస్తవాలను నిర్ధారించి బాధ్యతాయుతంగా ప్రజలకు చేరవేయడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
